Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Monday, September 23, 2013

సామెతలు30

Pro 30:1  దేవోక్తి, అనగా యాకె కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును, ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పినమాట. 
Pro 30:2  నిశ్చయముగా మనుష్యులలో నావంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు. 
Pro 30:3  నేను జ్ఞానాభ్యాసము చేసికొన్నవాడను కాను పరిశుద్ధ దేవునిగూర్చిన జ్ఞానము పొందలేదు. 
Pro 30:4  ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా? 
Pro 30:5  దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము. 
Pro 30:6  ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. 
Pro 30:7  దేవా, నేను నీతో రెండు మనవులు చేసికొను చున్నాను నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము; 
Pro 30:8  వ్యర్థమైనవాటిని ఆబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. 
Pro 30:9  ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతు నేమో. 
Pro 30:10  దాసునిగూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ వగుదువు. 
Pro 30:11  తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. 
Pro 30:12  తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యమునుండి కడుగబడని వారి తరము కలదు. 
Pro 30:13  కన్నులు నెత్తికి వచ్చినవారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడియున్నవి! 
Pro 30:14  దేశములో ఉండకుండ వారు దరిద్రులను మింగు నట్లును మనుష్యులలో ఉండకుండ బీదలను నశింపజేయు నట్లును ఖడ్గమువంటి పళ్లును కత్తులవంటి దవడపళ్లును గల వారి తరము కలదు. 
Pro 30:15  జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు తృప్తిపడనివి మూడు కలవుచాలును అని పలుకనివి నాలుగు కలవు. 
Pro 30:16  అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. 
Pro 30:17  తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును. 
Pro 30:18  నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ, 
Pro 30:19  బండమీద సర్పము జాడ, నడిసముద్రమున ఓడ నడచుజాడ, కన్యకతో పురుషుని జాడ. 
Pro 30:20  జారిణియొక్క చర్యయును అట్టిదే; అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగననును. 
Pro 30:21  భూమిని వణకించునవి మూడు కలవు, అది మోయ లేనివి నాలుగు కలవు. 
Pro 30:22  అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండ అన్నము కలిగిన మూర్ఖుడు, 
Pro 30:23  కంటకురాలై యుండి పెండ్లియైన స్త్రీ, యజమాను రాలికి హక్కు దారురాలైన దాసి. 
Pro 30:24  భూమిమీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానముగలవి. 
Pro 30:25  చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. 
Pro 30:26  చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. 
Pro 30:27  మిడుతలకు రాజు లేడు అయినను అవన్నియు పంక్తులు తీరి సాగిపోవును. 
Pro 30:28  బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది యుండును. 
Pro 30:29  డంబముగా నడుచునవి మూడు కలవు ఠీవితో నడుచునవి నాలుగు కలవు 
Pro 30:30  అవేవనగా ఎల్లమృగములలో పరాక్రమముగలదై ఎవనికైన భయపడి వెనుకకు తిరుగని సింహము 
Pro 30:31  శోణంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. 
Pro 30:32  నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి యుండినయెడల కీడు యోచించి యుండినయెడల నీ చేతితో నోరు మూసికొనుము. 
Pro 30:33  పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును 
Download Audio File 

No comments:

Post a Comment